Connect with us

Education

మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన వైభవంగా సిలికానాంధ్ర మనబడి స్నాతకోత్సవం: Milpitas, California

Published

on

ఉత్తర కాలిఫోర్నియా లోని మిల్ పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో డా.లక్కిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో ఆదివారం మధ్యాహ్నం సిలికానాంధ్ర మనబడి స్నాతకోత్సవ సభ విజయవంతంగా జరిగింది. గౌరవనీయులు మాజీ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి అధ్యక్షతన కొన్ని వందల మంది మనబడి విద్యార్ధులు వారి తల్లిదండ్రుల సమక్షంలో ఈ ఉత్సవం ఒక పండుగ లాగా జరిగింది.

గత ఎనిమిది సంవత్సరాలుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో మనబడి పిల్లలకు జూనియర్ మరియు సీనియర్ సర్టిఫికేట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 2021-22 విద్యాసంవత్సరానికి 1689 మంది విద్యార్థులు జూనియర్ సర్టిఫికెట్, మరియు 1102 మంది విద్యార్థులు సీనియర్ సర్టిఫికెట్ పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షల్లో 97.8 శాతం ఉత్తీర్ణతతో జూనియర్ సర్టిఫికెట్ విద్యార్థులు, 97.7 శాతం ఉత్తీర్ణతతో సీనియర్ సర్టిఫికెట్ విద్యార్థులు ఘన విజయాలు సాధించారు.

తెలుగు భాషాజ్యోతిని పట్టుకొని వందల మంది విద్యార్థులు శోభాయాత్రగా వేదిక మీదకు తరలిరావడంతో సభ ప్రారంభమైంది. అధ్యక్షోపన్యాసం చేస్తూ శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు అమెరికాలో అధిక సంఖ్యలో మాట్లాడే మొదటి 20 భాషల్లో తెలుగు చోటు చేసుకోవడమే కాకుండా అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న భాషగా రూపుదిద్దుకోవడం చాలా ఆనందదాయకమని పేర్కొన్నారు. అమెరికాలో లో తెలుగు భాషాభివృద్ధికి సిలికానాంధ్ర మనబడి చేస్తున్న కృషిని అభినందిస్తూ పదిహేను సంవత్సరాల్లో 75 వేల మందికి తెలుగు నేర్పడం ఒక అద్భుత విజయంగా అభివర్ణించారు.

గత 15 సంవత్సరాలుగా విదేశాల్లో పుట్టి పెరుగుతున్న పిల్లలకు ప్రణాళికాబద్ధంగా తెలుగు భాషను నేర్పుతూ WASC (అమెరికా సంస్థ) గుర్తింపుపొందిన ఏకైక విద్యాసంస్థ సిలికానాంధ్ర మనబడి మాత్రమేనని దాని అధినేత శ్రీ చమర్తి రాజు గారు సభికులకు గుర్తు చేశారు. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ కూచిబొట్ల ఆనంద్ గారు మాట్లాడుతూ, ఈ విజయం వెనుక ఉన్న 2500 మంది భాషా సైనికుల స్వచ్ఛంద సేవను, అమెరికాలో పుట్టిన పిల్లలకు మన సంస్కృతీ సంప్రదాయాలతో బాటుగా భాషనూ నేర్పిస్తున్న పిల్లల తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా అభినందించారు.

ఈనాటి సాయంత్రం జరిగిన కార్యక్రమంలో మరో ప్రత్యేక ఆకర్షణ ప్రఖ్యాత రంగస్థల కళాకారులు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారి దర్శకత్వంలో మనబడి విద్యార్ధులు ప్రదర్శించిన శ్రీకృష్ణ రాయబారం పద్య నాటకం. శ్రీ గుమ్మడి గారి నటశిక్షణలో ఈ విద్యార్థులు ప్రదర్శించిన నాటకం ప్రేక్షకులను ఉర్రూతలూగించగా వారి కరతాళధ్వనులతో ఆడిటోరియం మార్మోగింది. శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు మాట్లాడుతూ సిలికానాంధ్ర సంస్థతో తన అనుబంధాన్ని, మనబడి పిల్లలతో అమెరికా నలుమూలలా తన దర్శకత్వంలో జరుగుతున్న పద్య నాటకాలతో, రాబోయే తరంలో పద్యనాటకం అమెరికాలోనైనా కొనసాగుతుందన్న నమ్మకం కలుగుతోందని అన్నారు.

ఈ నాటకంలో శ్రీ కృష్ణ పాత్రలో కుమారి సంజన తొడుపునూరి, దుర్యోధన పాత్రలో కుమారి కాట్రెడ్డి శ్రియ నటన, వారు రాగయుక్తంగా పాడిన రాయబార పద్యాలు ప్రేక్షకులను అలరించాయి. నాటకంలో పాల్గొన్న బాల బాలికలు అందరికీ శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు తమ అభినందనలను, ఆశీర్వచనాలను అందజేశారు. మనబడి స్నాతకోత్సవానికి శ్రీమతి గంటి శ్రీదేవి గారు, శ్రీమతి రాధా శాస్త్రి గారు సమన్వయకర్తలుగా వ్యవహరించారు.

ఈ సభ విజయవంతం అవ్వడానికి సిలికానాంధ్ర కార్యకర్తలు శ్రీ కొండిపర్తి దిలీప్ గారు, శ్రీమతి కూచిభొట్ల శాంతి గారు, శ్రీ కందుల సాయి గారు, శ్రీ సంగరాజు దిలీప్ గారు, శ్రీ కోట్ని శ్రీరాం గారు, శ్రీ తనారి గిరి గారు, శ్రీ కస్తూరి ఫణిమాధవ్ గారు తదితరులు విశేష కృషి చేశారు. 2022-23 మనబడి విద్యా సంవత్సరం సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి మొదలవుతుందని, రిజిస్ట్రేషన్లు https://manabadi.siliconandhra.org/ లో మొదలయ్యాయని, తల్లిదండ్రులు వెంటనే తమ పిల్లలను నమోదు చేసుకోవాలని, అలాగే ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ మనబడి చేస్తున్న భాషా యజ్ఞం గురించి తెలియజేయాలని, వారిని కూడా మనబడిలో చేరమని ప్రోత్సహించాలని కులపతి చమర్తి రాజు గారు విజ్ఞాపన చేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected