Connect with us

News

తగ్గేదేలే! తానా సభ్యత్వ ఉప్పెనలో ఎవరు ముందున్నారు?

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’! ఈ రెండక్షరాల పేరు వినగానే ‘సంఘ సేవ’ అనే రెండు పదాల మాట ఘల్లుమంటుంది. అదే సమయంలో ‘ఎలక్షన్స్’ మరియు ‘ప్రెసిడెంట్’ అనే రెండు వేర్వేరు పదాలు కూడా బోత్ ఆర్ నాట్ సేమ్ అంటాయి. ఎందుకంటే ఏకగ్రీవం అయితే ప్రెసిడెంట్ ఒకరు అవుతారు, అదే ఎలక్షన్స్ జరిగితే తగ్గేదేలే అంటూ ఆ ఒకరు ఇంకొకరు అవుతారు.

ఇంతకీ అఖండ, పుష్ప సినిమాల్లోని డైలాగ్స్ తో తానాకి సంబంధం ఏంటంటారా? అక్కడికే వస్తున్నా, కూసింత ఓపిక పట్టండో! ఎప్పుడో 1977లో స్థాపించిన తానా, సమయానుచితంగా తానా బోర్డ్, తానా ఫౌండేషన్, తానా టీం స్క్వేర్, తానా కేర్స్ వంటి వివిధ రెక్కలతో అంచలంచలుగా ఎదిగి నార్త్ అమెరికాలోనే అతి పెద్ద ఇండో-అమెరికన్ సంస్థగా అవతరించింది. ఆ తర్వాత ఎన్ని సంస్థలు ఉద్భవించినా తానా మాత్రం పెద్దన్న పాత్రను పోషిస్తూ మంచి క్రేజ్ తో ముందుకెళుతోంది.

అందుకేనేమో తానా ప్రెసిడెంట్ పదవి ఇండియాలో కేంద్ర క్యాబినెట్ మంత్రిత్వంతో సమానం అంటారు. తానా అధ్యక్షులు ఇండియా వెళ్ళినప్పుడు జరిగే హంగు, ఆర్భాటం చూస్తే నిజమేనన్న ఆలోచన రాకమానదు. మరి ఇంత పవర్ఫుల్ తానా అధ్యక్ష పదవికి విపరీత పోటీ ఉండడంలో ఆశ్చర్యం ఏముంటుంది! క్రిందటి ఎలక్షన్ హోరాహోరీ చూస్తే నమ్మి తీరాల్సిందే.

గత ఎలక్షన్ ఫలితాలు వచ్చి 8 నెలలు కూడా కాలేదు మళ్ళీ అప్పుడే ఈ చర్చ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. వస్తన్నా పాయింట్ కి వస్తున్నా. తానాలో అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉండవు. కార్యనిర్వాహక ఉపాధ్యక్ష పదవికి మరియు ఇతర పదవులకు మాత్రమే ఎన్నికలు ఉంటాయి. ఎందుకంటే కార్యనిర్వాహక ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన వ్యక్తి ఆ తర్వాత టర్మ్ లో ఆటోమేటిక్ గా అధ్యక్షునిగా నియమించబడతారు.

ఈ 2022 జనవరి 31 లోపు తానా సభ్యత్వం తీసుకున్నవారు మాత్రమే 2023 లో వచ్చే ఎన్నికల్లో వోట్ వేయడానికి అర్హులవుతారు. ఇదీ అసలు తంతు. అందుకే అందరూ ఎవరి బలాబలాలు పెంచుకోవడం కోసం తమ వారిని తానా సభ్యత్వం తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఇందులో వివిధ పదవులకు ఆశావహులుగా ఉన్నవారు గేరు మార్చి స్పీడ్ గా జనవరి 31 లోపు తానా సభ్యత్వాలు చేర్పిస్తారు.

పనికిరాని మొగుడు మంచం నిండా ఉన్నా ఉపయోగం ఏముంది అన్నట్టు తానా సభ్యత్వాలు ఎక్కువ చేర్పించలేనివారు ఆశలు వదులుకోవాల్సిందే. ఇంతకుముందు వరకు సుమారు 34 వేలకు పైగా ఉన్న సభ్యత్వాలు ఇప్పుడు ఉన్న ఊపు చూస్తుంటే రెట్టింపై 70 వేలు కూడా దాటి జూజూబి అనేలా ఉన్నారు. చూద్దాం ఇంకా 10 రోజులు ఉందిగా అంటున్నారు కొంతమంది ఆశావహులు.

పెళ్లయింది కానీ శోభనం జరగలేదు అన్న చందాన మొన్నటి ఎన్నికల అనంతరం తానాలో మూడు ముక్కలాట మొదలైన సంగతి తెలిసిందే. వెటరన్స్, న్యూబీస్, ముదుర్స్ అనే మూడు వర్గాలుగా తయారై ఆధిపత్యం కోసం పోరాడుతున్నారు.

ఒక వర్గం పోయిన ఆధిపత్యాన్ని తిరిగి పొందాలని, ఇంకో వర్గం ఆధిపత్యం తెచ్చుకోవాలని, మరో వర్గమేమో ఉన్న ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని ఇలా ఎవరి స్టేక్స్ వాళ్ళు పెంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుత సభ్యత్వ నమోదు పెద్ద ఉప్పెనలా నడుస్తుంది. ఈ మధ్యనే తానా సీనియర్ సభ్యులు సతీష్ చిలుకూరి మళ్ళీ మొదలైన మెంబర్షిప్ సర్కస్ ని నివారించేలా తానా బైలాస్ మార్చండని కోరుతూ ప్రస్తుత నాయకత్వానికి విన్నవించడం పరిస్థితికి అద్దం పడుతుంది.

ప్రతి రెండు సంవత్సరాలకోసారి కన్వెన్షన్ కి ముందు చైతన్య స్రవంతి పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవాకార్యక్రమాలు నిర్వహించడం తానాకి పరిపాటి. కానీ ఈ టర్మ్ లో మొదటి సంవత్సరంలోనే మొన్న డిసెంబర్లో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించిన కార్యక్రమాలు, హంగామా చూస్తే ఇక వచ్చే సంవత్సరం చైతన్య స్రవంతి ధూంధాంగా జరుగుతుంది అని ఆలోచన కొచ్చిన డబ్బున్న మారాజులను కొందరు 10 వేలు పెట్టి డోనార్ సభ్యత్వం తీసుకునేలా ప్రేరేపిస్తున్నారు. ఇటు అమెరికాలో తానా డోనార్ సభ్యత్వం, అటు ఇండియాలో చైతన్య స్రవంతిలో భాగంగా తమ ఊరిలో సేవాకార్యక్రమాలతో వ్యక్తిగత పబ్లిసిటీ. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నమాట.

ఇక మామూలు సభ్యత్వాల విషయానికొస్తే టెక్సాస్, న్యూ జెర్సీ ప్రాంతాలు రేసులో బాగా ముందున్నట్టు తెలుస్తుంది. కాకపోతే టెక్సాస్ లో ఓటర్లు ఎంతమంది ఉంటారో లీడర్లు కూడా అంతమందే ఉంటారు అని వినికిడి. వర్జీనియా, కాలిఫోర్నియా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా తర్వాత వరసలో ఉన్నట్టు వార్తలు. మిగతా ఒక మోస్తరు నగరాల్లో అర కొర మెంబర్షిప్స్ ఎటూ చేపిస్తూనే ఉన్నారు. విశేషమేంటంటే కాలిఫోర్నియా, నార్త్ కరోలినా నువ్వా నేనా అన్నట్టు సభ్యత్వాల నమోదు నడుస్తుందట.

ఒక పక్క ఇంతలా నడుస్తుంటే ఇంకోపక్క సౌత్ఈస్ట్ లో పెద్దగా మూవ్మెంట్ లేకపోవడం చూస్తుంటే సంథింగ్ ఈస్ కుకింగ్ అనిపిస్తుంది అంటున్నారు తానా పండితులు. ఇంకొంతమంది ఎదో ఒక వర్గం చివరికి మనల్ని సపోర్ట్ చేస్తుందిలే అని మెంబర్షిప్స్ చేర్పించకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం కూడా ఆశ్చర్యమే.

ఏది ఎలా ఉన్నా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. అందునా తానాలో ఎవరు ఎవరినీ ఎన్నికలరోజు వరకు కూడా నమ్మరు. కాబట్టి అందరూ మనవాళ్లే లేక పలానా వాళ్ళు చేర్పిస్తున్న మెంబర్షిప్స్ మనవేలే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఎవరైనా ఆఖరికి గెలుపు గుర్రాల వైపే ఉండాలనుకుంటారు. పెందుర్తి బాబు చివరి ఓటు లెక్క తేలేదాకా ఓటమిని ఒప్పుకోడు అన్నట్టు ఈ జనవరి 31 ముగిస్తే గాని ఎవరు ఎన్ని కొత్త మెంబర్షిప్స్ చేర్పించారు, వాటిలో చెల్లేవి ఎన్ని చెల్లనివి ఎన్ని తేల్చి, తర్వాత పాత మెంబర్షిప్స్ లెక్కలతో సరితూచి ఏ వర్గం స్టేక్స్ హైలో ఉన్నాయో తెలుసుకోవాలి. అప్పటివరకు ఉగ్గబట్టుకు కూర్చోవలసిందే.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected