Connect with us

Politics

అట్లాంటా తమ్ముళ్లతో మమేకమైన దేవినేని ఉమా, చంద్రబాబు బాటలో నడవాలని పిలుపు

Published

on

ఎన్నారై టీడీపీ అట్లాంటా ఆధ్వర్యంలో ఆగష్టు 28న ఆంధ్రప్రదేశ్ మాజీ నీటిపారుదల శాఖా మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వర రావు తో అట్లాంటా టీడీపీ నాయకులు, అభిమానులు మరియు సానుభూతిపరులు సమావేశమయ్యారు. స్థానిక బిర్యానీ పాట్ ఈవెంట్ హల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు 300 మందికి పైగా హాజరయ్యారు.

సభ ప్రారంభానికి ముందు ఆహ్వానితులందరితో దేవినేని ఉమా కుశల ప్రశ్నలు వేసి, తమ తమ నియోజకవర్గ వివరాల గురించి ప్రస్తావించడంతో అందరూ సంతోషం వెలిబుచ్చారు. సభ ప్రారంభం అనంతరం కొందరు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ సందర్భంగా దేవినేని రమణ ని స్మరించుకుంటూ రెండు నిముషాలు మౌనం పాటించారు.

తదనంతరం దేవినేని ఉమా మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు అప్పట్లోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పెద్ద పీట వేయడంవల్ల మన తెలుగువారు రెండు సూట్కేసులు పట్టుకొని అమెరికా తరలి రావడం, ఉన్నత విద్య ని అభ్యసించడం, ఐటీ లో ఉన్నత స్థానాలకెళ్లడం, రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో రాణించడం వంటి విషయాలను ప్రస్తావించారు. అమెరికా రాజకీయాలలో కూడా ప్రముఖ పాత్ర వహించి మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.

అలాగే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లిన పరిస్తుతులను, ఆంధ్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్, రాజధాని లను నాశనం చేసిన విధానం, ఓటర్ ఫ్రాడ్, ఫేక్ ప్రోపగాండా తదితర విషయాలను విశదీకరించారు. కానీ ఎవరైనా ప్రజలను ఒక్కసారే మోసం చేయగలరని, రాబోయే ఎలక్షన్లలో టీడీపీ తగ్గేదేలే అంటూ ఉత్సాహాన్ని నింపారు.

తాము పడే కష్టం తాము పడుతున్నామని, ఎన్నారైలు కూడా తమ నియోజకవర్గాల్లో బూత్ లెవెల్లో ఓటర్ వెరిఫికేషన్ చేయించాలని, స్వింగ్ ఓటర్లను ప్రభావితం చేసేలా ఇప్పటి నుంచే క్రమపద్ధతిలో కార్యాచరణ చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నారైటీడీపీ.కామ్ లో రెజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.

చివరిగా తమ ఆహ్వానాన్ని మన్నించి మొదటిసారిగా అట్లాంటా విచ్చేసిన అతిధి దేవినేని ఉమా మహేశ్వర రావు ని, అలాగే తన వెంటే ఉంటూ అమెరికాలో ప్రతి సమావేశానికి తోడుండి నడుస్తున్న డెలావేర్ వాసి హరీష్ కోయ తదితరులను శాలువా, పుష్ప గుచ్ఛంతో ఘనంగా సత్కరించారు.

ఆదివారం సాయంత్రం అయినప్పటికీ 300 మందికి పైగా హాజరవడం అట్లాంటాలో తెలుగుదేశం పార్టీ బలాన్ని తెలియజేస్తుంది. చివరిగా అందరూ భోజనాలు గావించి కార్యక్రమాన్ని ముగించారు. మరిన్ని ఫోటోల కొరకు మన www.NRI2NRI.com ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected