Connect with us

Associations

డల్లాస్ లో ‘సిరివెన్నెల’ కి అశ్రునివాళి: తానా, ఆటా, నాటా, నాట్స్, టి. టి.ఎ, టాంటెక్స్

Published

on

డల్లాస్, టెక్సస్, డిసెంబర్ 2: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఆటా, నాటా, నాట్స్, టి.టి.ఎ మరియు టాంటెక్స్ ఆద్వర్యంలో పద్మశ్రీ చేంబోలు “సిరివెన్నెల”  సీతారామశాస్త్రి గారికి డాలస్ లోని సాహితీమిత్రులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. తానా ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన కార్యక్రమాన్ని ప్రారంభించి అందరం ఇలా “సిరివెన్నెల” గారి సంతాపసభలో కలుసుకోవడం బాధాకరం అన్నారు.  వారు సినీ, సాహిత్య రంగానికి చేసిన కృషి మరువలేనిదని, వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకి ప్రగాఢ సానుభూతిని తేలియజేశారు.

నాటా ఉత్తరాధ్యక్షులు డా. శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, టాంటెక్స్ అధ్యక్షురాలు లక్ష్మి అన్నపూర్ణ పాలేటి  మాట్లాడుతూ “సిరివెన్నెల” గారు మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరమని, ఒక మంచి రచయిత, సాహితీవేత్తని కొల్పోయామని, వారి ఆత్మకి శాంతి కలగాలని కోరారు.

తానా పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “సిరివెన్నెల” గారు తనకు వ్యక్తిగతంగా చాలా ఆత్మీయులని, బావగారూ అని ఆత్మీయంగా పలకరించేవారని, ఆ పిలుపు ఇలా అర్ధాంతరంగా, శాశ్వతంగా దూరంవుతుందని వూహించలేదని అన్నారు. తెలుగు జాతి ఒక అద్భుతమైన ఆణిముత్యాన్ని కోల్పోయిందని సినీ, సాహిత్య రంగానికి ఇది ఒక చీకటి రోజని, వారు లేని లోటు తీర్చలేనిదని అభిప్రాయపడ్డారు. 2019 లో వారికి “పద్మశ్రీ” వచ్చిన తరువాత అమెరికాలో వివిధ నగరాలలో అనేక సాహిత్య కార్యక్రమాలకు రూపకల్పన చేశామని, కోవిడ్ పరిస్థితుల కారణంగా వారు అమెరికా రావడానికి వీలుపడలేదన్నారు. సిరివెన్నెల కు తానా సంస్థతో విడదీయరాని అనుభంధం ఉందని, అనేక మహాసభలకు అయన స్వాగత గీతాలు రాశారని, జీవిత సాఫల్య పురస్కారంతో సిరివెన్నెలను తానా సన్మానించిందని ప్రసాద్ తోటకూర గుర్తుచేసుకున్నారు.

సిరివెన్నెలకు సమీప బంధువు, అతి సన్నిహితులైన యాజి జయంతి తాను విశాఖ స్టీల్ ప్లాంట్ల్ లో పనిచేస్తున్నప్పటినుండి వారితో గడిపిన రోజులు గుర్తుచేసుకొని, డాలస్ ఎప్పుడు వచ్చినా వారి ఇంట్లోనే ఉండేవారని చెప్పారు. “మురారి” సినిమా పాటలు సిరివెన్నెల తమ ఇంట్లో బస చేసినప్పుడే రాశారని భీంశంకర్ రావ్ తెలిదేవర అంటూ వారితో గడిపిన ఎన్నో మధుర స్మృతులను గుర్తుచేసుకున్నారు.

శారద, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, డా. ఇస్మాయిల్ పెనుగొండ, విజయ్ కాకర్ల, చినసత్యం వీర్నపు, చంద్రహాస్ మద్దుకూరి, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, డా. రమణ జువ్వాడి, యుగంధరాచార్యులు, కళ్యాణి, రఘు తాడిమేటి, రమాకాంత్ మిద్దెల, కోట ప్రభాకర్, శ్రీ బసాబత్తిన, ములుకుట్ల వెంకట్, సుందర్ తురుమెళ్ళ, విజయ్ రెడ్డి, రమణ పుట్లూరు, డా. కృష్ణమోహన్ పుట్టపర్తి, లోకేష్ నాయుడు, నాగరాజు నలజుల, పరమేష్ దేవినేని, శ్రీకాంత్ పోలవరపు, శాంత, డా. విశ్వనాధం పులిగండ్ల, గీత, వేణు దమ్మన, ఎన్.ఎం.ఎస్ రెడ్డి, బసివి ఆయులూరి మొదలైన పలువురు ప్రవాస భారతీయులు బాధాతప్త హృదయాలతో “సిరివెన్నెల” గారితో వారికున్న అనుభంధం, పరిచయం, అనుభూతులను పంచుకున్నారు.

అక్షరయోధుడు, అమర జీవి “సిరివెన్నెల” మన మధ్యలో లేకపొయినా వారు మనకు అందించిన సాహిత్యం, తెలుగు సినిమాలున్నంత వరకు అజరామరంగా నిలిచిపోతుందని పలువురు అభిప్రాయపడ్డారు. మైత్రి రెస్టారెంట్ వారికి, వివిధ ప్రసార మాధ్యమాలకు, వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు సతీష్ కొమ్మన కృతఙ్ఞతలను తెలియజేశారు. అందరూ “సిరివెన్నెల” గారి ఆత్మకు చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించడంతో కార్యక్రమం ముగిసింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected