Connect with us

Government

బీసీ సంక్షేమ జేఏసీ ఎన్నారై శాఖ అధ్యక్షునిగా అట్లాంటా వాసి చిల్లపల్లి నాగ తిరుమల రావు

Published

on

బీసీ సంక్షేమ జేఏసి అధ్యక్షుడిగా నియమితులైన అట్లాంటా వాసి చిల్లపల్లి నాగ తిరుమల రావు మిడ్ వ్యాలీ సిటీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నాగ తిరుమల రావు కి అభినందనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ప్రముఖులైన ఎమ్మెల్సీలతో పాటు బీసీ వెల్ఫేర్ పెద్దలంతా తరలివచ్చి ఆయనను అభినందించారు. నాగ తిరుమల రావు రాకతో కొత్త కళ వచ్చిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా చిల్లపల్లి నాగ తిరుమల రావు మాట్లాడుతూ ప్రవాస భారతీయులను సంఘటితం చేసేందుకు ఇప్పటికే తాము కృషి చేస్తున్నామని తెలియజేశారు. బీసీలలో కూడా సఖ్యత చేకూరడంతో పాటు మరోవైపు బీసీ వెల్ఫేర్ జేఏసీని సంఘటిత పరిచేందుకు కృషి చేస్తామని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. పూర్తి స్థాయి కమిటీని ఎన్ఆర్ఐ బీసీ వెల్ఫేర్ జేఏసికి నియమించడం జరుగుతుందని వెల్లడించారు . తనపై విశ్వాసం ఉంచి పదవి బాధ్యతలు అప్పగించిన పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీ వెల్ఫేర్ జేఏసీ నాయకత్వం గురించి నిర్దేశించిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ముందుకు సాగుతామని చెప్పారు. అందరికీ నాగ తిరుమల రావు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇంకా ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లిజగన్ మోహన్ రావు, గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు వింజమూరి శ్రీనివాసరావు, మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు తుళ్ళి మిల్లి రామకృష్ణ, మంగళగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు వింజమూరి మంజుల, మంగళగిరి పట్టణ అధ్యక్షులు వూట్ల పాల శ్రీనివాస్ రావు, లతో పాటు రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు జగ్గారపు శ్రీనివాసరావు, బీసీ వెల్ఫేర్ జేఏసి నాయకులు వరప్రసాద రావు, నగేష్, దుర్గారావు, ప్రసాదరావు, బాపూజీ, కుబేర స్వామి తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాధికారం ద్వారానే వెనుకబడిన తరగతుల వారి సమస్యలు పరిష్కారం అవుతాయని వక్తలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బీసీలంతా సంఘటితం కావలసిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు , జంగా కృష్ణమూర్తి, పోతుల సునీత, గంజి చిరంజీవి డాక్టర్ ఆనందయ్య వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు బీసీ వెల్ఫేర్ జేఏసీ ప్రాముఖ్యతను వివరించారు. శాసన మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ బీసీల బాగుకోసం రాష్ట్రమంతా పర్యటించడం జరిగింది అని, లోతుగా అధ్యయనం చేశామని తెలియజేశారు. ఈ క్రమంలోనే ఒక సుదీర్ఘ నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమర్పించడం జరిగిందని చెప్పారు. మాజీ మంత్రి మరియు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ పరస్పరం అన్ని విధాలుగా బీసీలు సహకారాన్ని అందించుకోవాలని పిలుపునిచ్చారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితం లో ఒక బీసీ గా అనేక ఒడిదుడుకులు చవిచూసిన విషయాన్ని గుర్తు చేశారు. మున్సిపల్ చైర్మన్ గా, ఎమ్మెల్యేగా , మంత్రిగా ఆప్కో చైర్మన్ గా కూడా వివిధ పద్ధతుల్లో సేవలను అందించడం జరిగిందని చెప్పారు. ఇప్పటికీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నానని గుర్తు చేశారు . ఒకరికొకరు సహకారాన్ని ఇచ్చి పుచ్చుకున్నపక్షంలో బీసీలు పాలకులుగా మారడం పెద్ద కష్టం ఏమీ కాదని వ్యాఖ్యానించారు. ఆ దిశగా బిసి వెల్ఫేర్ జేఏసీ కృషి చేయాలని, పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు బీసీ వెల్ఫేర్ జేఏసీ కార్యకలాపాలు విస్తరించాలని సూచించారు.

మరో ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ విదేశాలలో కూడా బీసీ వెల్ఫేర్ జేఏసీ కార్యకలాపాలు విస్తరించడం చెప్పుకోదగ్గ పరిణామమని తెలిపారు. ఎన్ఆర్ఐ బీసీ వెల్ఫేర్ జేఏసీ అధ్యక్షునిగా చిల్లపల్లి నాగ తిరుమల రావు లక్ష్య సాధనలో విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించారు. జేఏసీ కార్యకలాపాల కు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని కూడా ఆమె తెలియజేశారు. ముఖ్యంగా కార్యక్రమంలో భాగంగానే మహిళ లకు గుర్తింపు ఇవ్వాలని ఆమె కోరారు . తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మంగళగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి మాట్లాడుతూ బీసీ వెల్ఫేర్ జేఏసీ సంకల్పం చాలా గొప్పదని అభివర్ణించారు. పార్టీలు, కులాలు , మతాలు, ప్రాంతాలకు అతీతంగా కార్యక్రమాలు చేపట్టాలని, అప్పుడే బీసీల ప్రభంజనం సృష్టించవచ్చని తెలిపారు . బీసీ వెల్ఫేర్ జేఏసీ కార్యక్రమాలు విజయవంతం అవుతాయనడంలో సందేహం లేదని స్పష్టం చేశారు.

బీసీ వెల్ఫేర్ వ్యవస్థాపక అధ్యక్షులు అంగిరేకుల ఆదిశేషు మాట్లాడుతూ సుదీర్ఘ లక్ష్యంతో ఈ సంఘాన్ని స్థాపించినట్టు తెలియజేశారు. వివిధ అంశాలకు సంబంధించి బీసీలలో చైతన్యాన్ని కలిగించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఖండాంతరాలలో కూడా బీసీలు ఉన్నారని, వారిని సంఘటిత పరిచే దిశగా తమ సంఘం ఎంత దూరమైనా వెళ్తుందని తెలియజేశారు. ప్రారంభం కంటే ఇప్పుడు బీసీ వెల్ఫేర్ జెఎసికి ఆదరణ రోజు రోజుకు పెరుగుతున్నదని గుర్తు చేశారు. తమ కమిటీ లో కనీసం ఎమ్మెల్యేగా పోటీ చేయదగ్గ స్థాయి కలిగిన బీసీ నాయకులు రాష్ట్ర కమిటీ లో , జిల్లా కమిటీ లో ఉన్నారని చెప్పారు చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీల ప్రయోజనాలకు సంబంధించి తమకు ఏ ప్రభుత్వం అయినా ఒకటే అని స్పష్టం చేశారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం బీసీలకు చేసే మంచినీ తాము స్వాగతిస్తామని తెలిపారు . చెడు చేస్తే వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. వెనుకబడిన తరగతుల వారిని వెనుకబాటుతనానికి దూరంగా ఉంచి వెన్నెముకగా తీర్చిదిద్దడమే లక్ష్యం అని స్పష్టం చేశారు.

ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు మాట్లాడుతూ బీసీలకు గుర్తింపు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందున్నదని తెలియజేశారు. అనాదిగా అనేక విధాలుగా మరుగునపడిన కులాలను వెలుగులోకి తీసుకురావడం జరిగిందని చెప్పారు. బీసీ వెల్ఫేర్ జెఎసి వ్యవస్థాపక అధ్యక్షులు అంగిరేకుల ఆదిశేషు నాయకత్వంలో మంచి ఫలితాలు రాబడుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ఆనందయ్య, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ అప్పారావు , ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్టేట్ ఆఫీసర్ మూర్తి వంటి అనేక మంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీ వెల్ఫేర్ జేఏసీ ఎన్ఆర్ఐ అధ్యక్షునిగా నియమితులై ప్రమాణ స్వీకారం చేసిన చిల్లపల్లి నాగ తిరుమల రావు ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఈ సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్సీలు హనుమంతరావు, సునీత, కృష్ణమూర్తి, బీసీ వెల్ఫేర్ జేఏసి ఎన్ఆర్ఐ అధ్యక్షులు చిల్లపల్లి నాగ తిరుమల రావులతో పాటు ఆసియా 57 కేజీల ఛాంపియన్ షిప్ స్వర్ణ పతక విజేత సాదియా అల్మాస్ తదితరులను కూడా ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా నాగ తిరుమల రావు సాదియా కు ప్రోత్సాహకరంగా పది వేల రూపాయల నగదును అందజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected