Connect with us

Literary

లేదు లేవు పాయే పోయే వచ్చె చేరె మాయే

Published

on

జారే అరుగుల ధ్యాసే లేదు
పిర్ర పై చిరుగుల ఊసేలేదు
అమ్మ చేతి మురుకులు లేవు
అలసట లేని పరుగులు లేవు


ఎత్తరుగులు మొత్తం పోయే
రచ్చబండలూ మచ్చుకు లేవు
వీధిలో పిల్లల అల్లరి లేదు
తాతలు ఇచ్చే చిల్లర లేదు


ఏడు పెంకులు ఏమైపోయే
ఎద్దు రంకెలు యాడకి పోయే
ఎక్కడా ఎదురు తడికెలు లేవు
ఏ తడికకీ భోగి పిడకలు లేవు


కూరలమ్మే సంతలు లేవు
పెరుగులమ్మే ముంతలు లేవు
బువ్వా లాటల విందే లేదు
గవ్వలాటలు ముందే లేదు


కుప్పిగంతులు లేనే లేవు
కళ్ళ గంతలు కానే రావు
కోకో మూతల గోలే లేదు
బచ్చాలాడే ఇచ్చా లేదు


కోతి కొమ్మచ్చి ఏమైపోయే
మాత అప్పచ్చి ముందే పాయే
గూటీ బిళ్ళా గూటికి పోయే
తొక్కుడు బిళ్ళకు రెక్కలు వచ్చె


గచ్చకాయలు మచ్చుకు లేవు
చింత పిక్కలు లెక్కకూ లేవు
ధారగా కారే ముక్కులు లేవు
జోరుగా జారే లాగులు లేవు


కొబ్బరి పుచ్చు కొరుకుడు లేదు
కొండముచ్చుని కెలుకుడు లేదు
బట్టన మురికి అంటక పోయే
మనసుకి మురికి జంటగ చేరె


కాకి ఎంగిలి కరువై పోయే
భుజాన చేతులు బరువై పోయే
అన్ని రంగులూ ఏడకో పోయే
ఉన్న రంగులూ చీడకి చేరె


ప్రస్తుత బాల్యం వెలవెల పోయే
దానికి మూల్యం ప్రస్తుత మాయే

Advertisement