Connect with us

Associations

అలరించిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ ఉగాది ఉత్సవాలు

Published

on

ఏప్రిల్ 23 మధ్యాహ్నం గ్రాఫ్టన్ హైస్కూల్ ప్రాంగణం తెలుగుదనంతో పండగ సందడితో తొణికిసలాడింది. బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం శుభకృత్ నామ సంవత్సర సంబరాలకి దాదాపు 400 మంది హాజరుకాగా 8 గంటల కార్యక్రమం నిరాఘాటంగా ఆహుతులని అలరించింది. వచ్చిన వారిని సాదరంగా ఆహ్వనిస్తూ, టి.ఏ.జి.బి కార్యవర్గం ఉగాది పచ్చడి, పానకం అందజేసింది.

బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు వారు ఉత్సాహంగా పాల్గొని, పాటలు, సాంప్రదాయ, సినీ నృత్యాలు, ఇన్స్ట్రుమెంటల్, నాటికలు వంటి వైవిధ్య భరితమైన దాదాపు 30 వినూత్న కార్యక్రమాలు ప్రదర్శించారు. వయో భేదం లేకుండా పిన్నా పెద్దా పాల్గొని ఆనందించారు. మల్లె పూల అంగడితో సహా రకరకాల అంగడులు, కమ్మటి ఫలహారాలు పిల్లల సందడులుతో ప్రాంగణం కళకళ లాడింది. వినోదం విజ్ఞానం మేళవించిన కార్యక్రమం అని సభ్యులు కొనియాడారు. తెలుగు భాషా, సంస్కృతుల ప్రాచుర్యంతో పాటు, టి.ఏ.జి.బి అనేక సేవాకార్యక్రమాలను కూడా నిరవధికంగా నిర్వహిస్తుంది. టి.ఏ.జి.బి చారిటి టీం గ్రాఫ్టన్ ఫూడ్ బ్యాంక్ కోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమం నిర్వహించి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించింది. స్థానిక సేవా కార్యక్రమాలకి సహకారం అందించడనికి టి.ఏ.జి.బి ముందుంటుంది అని కార్యరూపంలో మరోసారి చేసి చూపించింది. ఆహుతులు టి.ఏ.జి.బి చారిటి టీం ని కొనియాడారు, ప్రత్యేకంగా విరాళాలు ఇవ్వడానికి అందరిని ప్రేరేపించిన రోజ అయ్యగారికి ప్రశంసలు తెలిపారు.

2022-23 కొత్త గవర్నింగ్ బోర్డ్ సభ్యులని, కొత్త కార్యవర్గాన్ని టి.ఏ.జి.బి పూర్వ అధ్యక్షులు కోటేశ్వర రావు కందుకూరి పరిచయం చేసారు.
బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు: సురేందర్ మాదాడి – చైర్మన్; అనిల్ పొట్లూరి – వైస్ ఛైర్
బోర్డ్ సభ్యులు: చంద్ర కమ్మ; కృష్ణ మాజేటి; సీతారాం అమరవాది; రవీంద్ర మేకల, రామకృష్ణ పెనుమర్తి – ఎక్స్ అఫిషియొ
కొత్త కార్యవర్గం: రమణ దుగ్గరాజు – అధ్యక్షులు; పద్మజ బాలా – ప్రెసిడెంట్ ఎలెక్ట్; దీప్తి గోరా – కార్య దర్శి; ప్రశాంత్ దండా- సంయుక్త కార్యదర్శి; శ్రీనివాస్ గొంది- కోశాధికారి; సుధ ముల్పుర్ – సంయుక్త కోశాధికారి, సాంస్కృతిక కార్యదర్శి – శ్రీకాంత్ గోమట్టం.

అధ్యక్షులు రమణ దుగ్గరాజు ఆహుతులను ఉద్దేశించి మాట్లాడుతూ,
“మనల్ని అందరిని కలుపుతున్న అంతఃసూత్రం మనభాష తెలుగు కాబట్టి తెలుగులో మాట్లాడండి, ఆనందాన్ని అనుభూతుల్ని తెలుగులో పంచుకోండి. 2000 సంవత్సరాల చరిత్ర వున్న అద్వితీయమైన మనభాషని కాపాడుకొనే ప్రయత్నం చేయండి అని అన్నారు”. ఉగాది ఉత్సవాలలో పాల్గొన్న అందరికీ మరియు తెలుగు నేర్చుకుంటున్న పిల్లలను ప్రోత్సహిస్తున్న తల్లి దండ్రులకు, పిల్లలకు తెలుగు నేర్పిస్తున్న ఉపాధ్యాయులకు, కృతజ్ఞతాభివందనములు అందించారు. తెలుగు పద్య పఠనంలో పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు.

సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీకాంత్ గోమట్టం ఆధ్వర్యంలో అందరిని అలరించాయి. “మన బడి” పిల్లల తెలుగు నాటిక పిల్లలనెంతో ఆకట్టుకుంది. ప్రత్యేకంగా అరుణ్ ముల్పుర్ గారి ఆధ్వర్యంలో ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి నివాళి’ కార్యక్రమంలో గాయనీ గాయకులు శ్రీనివాస్ బలభద్రపాత్రుని, జగ్దీష్ బిస, మహతి మొదలి, అపర్ణ చాంబ్రవల్లి, రాధికా దీక్షిత్, ప్రశాంతి పుట్టగంటి గార్ల గాత్ర నివాళి ప్రేక్షకులని రంజింప చేసింది.

బాహుబలి ఫేమ్ గాయని ‘సత్య యామిని ‘సంగీత విభావరి’ అందరినీ ఉర్రూతలూగించింది. సత్య యామినితో జత కట్టిన భరద్వాజ పరకాల, మనోజ్ ఇరువూరి, వ్యాఖ్యాత మరియు గాయని మధూ నెక్కంటి కార్యక్రమంలో మెరిసి మురిపించారు. దీర్ఘ విరామం తర్వాత పెద్ద ఎత్తున ఆహ్లదకరమైన వాతావరణంలో ఆనందంగా జరిగిన టి.ఏ.జి.బి కార్యక్రమం ఒక తీపి జ్ఞాపకంగా మిగిలుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply