Connect with us

Devotional

సత్య ప్రమాణాలకు నిలువైన కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి గుడి పునర్నిర్మాణం, ఆగష్టు 21న మహా కుంభాభిషేకం

Published

on

. కాణిపాకం వినాయకుని గుడి పూర్తిగా పునర్నిర్మాణం
. వెయ్యి సంవత్సరాల తర్వాత పునర్నిర్మాణ అవకాశం
. శ్రీనివాస్ గుత్తికొండ, రవి ఐకా పూర్వజన్మ సుకృతం
. 10 కోట్లకు పైగా సొంత డబ్బు ఖర్చు
. ఆగష్టు 21న మహా కుంభాభిషేకం
. పాల్గొననున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు
. 6 నెలల అనంతరం పునఃదర్శన ప్రాప్తి

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం గురించి తెలియని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. బహుదా నదికి సమీపంలో వెలసిన ఈ గణేషుడు చిన్నవారి నుండి పెద్దవారి వరకు సత్య ప్రమాణాలకు నిలువెత్తు నిదర్శనం. తిరుపతికి సుమారు 68 కిలోమీటర్లు మరియు చిత్తూరుకి 11 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకొని తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, ఐరాల మండలం, విహరపురి గ్రామంలోని ఒక బావిలో స్వతహాగా, ప్రకృతి సిద్ధంగా వెలసిన వినాయక స్వామి విగ్రహం మరెక్కడనూ లేదు. ఆ బావిలోని నీరు ఎప్పటికీ ఇంకిపోవడం అంటూ జరగకపోవడం విశేషం. అలాగే ఇప్పటికీ ఆ బావిలోనే స్వామి వారి విగ్రహం కొలువైవుంది. ఈ విహరపురి గ్రామమే కాణిపాకం గా నామకరణం చేయబడింది.

సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం కులోతుంగ చోళ అనే చోళ రాజు ఈ స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి గుడి ని కట్టించడం, మళ్ళీ 1336 వ సంవత్సరంలో విజయనగర రాజవంశీయులు ఆధునీకరించడం అందరికీ తెలిసిన విషయమే. సుమారు వెయ్యి సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ కాణిపాకం గుడిని పూర్తిగా పునర్నిర్మిస్తున్నారు. ఇంతటి మహాభాగ్యాన్ని పొందినవారు అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం, టాంపా నగరవాసి శ్రీనివాస్ గుత్తికొండ మరియు మశాచుసెట్స్ రాష్ట్రం, బోస్టన్ నగరవాసి రవి ఐకా.

సుమారు 10 కోట్లు సొంత డబ్బుతో పునర్నిర్మాణం చేసే సదవకాశం దక్కడం వారి పూర్వజన్మ సుకృతమే అనుకోవాలి. సాధారణ సిమెంట్, కంకరరాయితో కాకుండా గానగ రాయి, కరక్కాయి మరియు తాటిబెల్లం కలిపిన బ్లాక్ గ్రానైట్ తో రాబోయే వెయ్యి సంవత్సరాలపాటు చెక్కుచెదరకుండా ఉండేలా ఆ స్వామి వారి గుడిని పునర్నిర్మించడం అభినందనీయం. ప్రతి రోజు గణపతి హోమం నిర్వహించేలా సుమారు 10 సంవత్సరాల క్రితమే శ్రీనివాస్ గుత్తికొండ గుడిలో యాగశాల నిర్మించడం తన భక్తికి నిదర్శనం.

విఘ్నేశ్వరునికి చేయించే ఆభరణాల కొలతల ప్రకారం విగ్రహ పరిమాణం కాలక్రమేణ పెరుగుతుండడం స్వామి వారి మహాత్యమే అనుకోవాలి. సుమారు 6 నెలల పునర్నిర్మాణ విరామం అనంతరం ఆగష్టు 4న ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన చేస్తున్నారు. అలాగే ఆగష్టు 21న చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకంతో భక్తులకు పునఃదర్శన ప్రాప్తి కలుగజేయనున్నారు.

ఈ ప్రత్యేక పూజాకార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, శాసనసభ సభ్యులు మరియు శాసనమండలి సభ్యులు విచ్చేయనున్నారు. అందరూ ఆగష్టు 21న కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శన భాగ్యం పొందగలరు. మరిన్ని వివరాలకు ఈ లింక్ ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected